వరంగల్‌లో పెరుగుతున్న హింస – భద్రతపై ప్రజల్లో భయం | Increasing Violence in Warangal – Public Safety at Risk | News9 Warangal
#Warangal Crime News, #Violence in Warangal #Public Safety in Warangal
న్యూస్ 9 వరంగల్: వరంగల్ నగరంలో నేరగాళ్ల స్వైర విహారం రోజురోజుకు పెరిగిపోతోంది. జనవరి 22న సుబేదారి ఠాణా సమీపంలోని అదాలత్ జంక్షన్ వద్ద జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. పాత కక్షల కారణంగా ఇద్దరు ఆటో డ్రైవర్లు నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసుకుని, ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.
అలాగే, భూపాలపల్లి పురపాలిక మాజీ కౌన్సిలర్ సరళ భర్త రాజలింగమూర్తి భూ వివాదంలో ఐదుగురు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి 7.30 గంటలకు పట్టణం మధ్యలోనే ఈ దాడి జరిగింది.
నేరాల పెరుగుదలతో వరంగల్ ప్రజల్లో భయాందోళన చెలరేగుతోంది. చిన్న ఘర్షణలకే కత్తులతో దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో యువకులు పట్టణం వీధుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. పోలీసుల పెట్రోలింగ్ తగ్గడం, నేరస్థులు రెచ్చిపోవడానికి ప్రధాన కారణంగా మారింది.
గురువారం ఒక్కరోజులోనే వరంగల్‌లో మూడు కత్తిపోటు ఘటనలు చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకునేలా చేస్తోంది. అయినా, ఘటనలు జరిగినప్పుడు పోలీసుల స్పందన మందకూడటం బాధితులను మరింత ఇబ్బందికి గురిచేస్తోంది.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2 హత్యలు, 5 హత్యాయత్నాలు, 7 దాడులు, 143 సాధారణ ఘర్షణలు, 8 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి.
ప్రజల భద్రతపై పోలీసుల నిర్లక్ష్య వైఖరి నేరాలకు కారణమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. వరంగల్‌లో శాంతి భద్రతలు పటిష్ఠం చేయాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.