పరారీలో నిందితుడు – వరంగల్‌లో ఘోర ఘటనపై పోలీసుల గాలింపు ముమ్మరం | Accused on the Run – Warangal Police Intensify Search | News9 Warangal
#Warangal Crime News, #Husband Attacks Wife Warangal, #Warangal Police Search Operation, #Doctor Attack Case Warangal, #Telangana Crime Updates
న్యూస్ 9 వరంగల్: వరంగల్ నగరంలో భార్య పల్లవిపై కత్తితో దాడి చేసిన భర్త కోట చంద్రశేఖర్ పరారీలో ఉన్నట్లు మట్టెవాడ ఠాణా సీఐ గోపీరెడ్డి తెలిపారు. ఈ కేసును ఛేదించేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
చంద్రశేఖర్ కొద్ది రోజులుగా సెల్‌ఫోన్ వాడటం లేదని పోలీసులు తెలిపారు. దీంతో అతని ఆచూకీ కనిపెట్టడం క్లిష్టంగా మారింది. స్నేహితులు, బంధువుల ద్వారా లభించిన సమాచారంతో ఉర్సు, కరీమాబాద్, దేశాయిపేట, రంగంపేట తదితర ప్రాంతాల్లో పోలీసులు శోధిస్తున్నారు. మరోవైపు నిందితుడి స్నేహితులు అతనికి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గాలింపును మరింత వేగవంతం చేసినట్లు సమాచారం.
పరస్థితి విషమంగా ఉన్న బాధితులు
భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన పల్లవి వరంగల్ కేఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే, ఈ దాడిలో గాయపడిన ఆమె తండ్రి బాబు, తల్లి అనిత ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వైద్యుడిపై దాడి – ఎనిమిది బృందాలుగా పోలీసుల గాలింపు
ఇదిలా ఉండగా, గురువారం రాత్రి ఉర్సుగుట్ట భట్టుపల్లి రోడ్డులో వైద్యుడు గాదె సుమంత్‌రెడ్డిపై దాడి ఘటనలో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు మరింత కసరత్తు చేస్తున్నారు. ఏసీపీ నందిరాంనాయక్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్, క్రైం విభాగం, ఇతర పోలీసు బృందాలతో ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి కాజీపేట, మడికొండ ప్రాంతాల్లో రోడ్లపై, దుకాణ సముదాయాల్లో, పెట్రోల్ పంపుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సుమంత్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడి తండ్రి గాదె ఆరోగ్య సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు నిందితులను పట్టుకునే వరకూ వీరి కదలికలపై నిఘా కొనసాగించనున్నారు. వరంగల్ నగరంలో జరుగుతున్న వరుస హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రజల్లో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.